మొదటిసారి కరోనా విజృంభించినప్పుడు మహేష్ బాబుపై ఆ ప్రభావం పెద్దగా పడలేదు. ఎందుకంటే, అప్పటికే అతడు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. మరో సినిమా ప్రకటించడానికి గ్యాప్ తీసుకున్నాడు. ఈలోగా కరోనా రావడంతో ఇంటికే పరిమితమైపోయాడు. కానీ ఈసారి పరిస్థితి అలా లేదు.
సరిగ్గా కరోనా సెకెండ్ వేవ్ ఊపందుకున్న టైమ్ కు మహేష్ బాబు సినిమా మధ్యలో ఉంది. ఇప్పుడు కూడా కావాలంటే మహేష్ తన సినిమా షూటింగ్ ను వాయిదా వేసుకోవచ్చు. కానీ అతడు మరో సినిమా స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు. కాబట్టి సర్కారువారి పాట సినిమాను వీలైనంత త్వరగా పూర్తిచేయాల్సిన అవసరం ఏర్పడింది.
పరశురాం దర్శకత్వంలో సర్కారువారి పాట సినిమా చేస్తున్నాడు మహేష్. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న టైమ్ లో ఈ సినిమా కొత్త షెడ్యూల్ ను మహేష్ మొదలుపెట్టాడు. దీనికి కారణం ఉంది. వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తిచేసి, త్రివిక్రమ్ తో కొత్త సినిమా మొదలుపెట్టాలనేది మహేష్ కోరిక.
ఇందులో భాగంగా జులై నాటికి సర్కారువారిపాట పూర్తిచేసి, ఆగస్ట్ నుంచి త్రివిక్రమ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లాలని అనుకుంటున్నాడు. అందుకే కరోనా భయాల మధ్యనే సర్కారువారి పాట షూటింగ్ ను మొదలుపెట్టాడు. ఓవైపు వైరస్ కారణంగా షూటింగ్స్ అన్నీ మరోసారి పోస్ట్ పోన్ అవుతున్న నేపథ్యంలో.. మహేష్ తన టార్గెట్ ను ఎలా చేరుకుంటాడో చూడాలి. ప్రస్తుతం సర్కారువారిపాట షూటింగ్ హైదరాబాద్ లో కొనసాగుతోంది.
No comments: